76 మంది పిల్లల్ని రక్షించిన ఆ మహిళా కానిస్టేబుల్‌కు డైరెక్ట్ ప్రమోషన్

Seema Dhaka Promoted Out Of Turn. ప్రమోషన్ కొట్టడం అంత సులువు కాదు. అది ప్రభుత్వ కంపెనీల్లో అయినా ప్రైవేటు

By Medi Samrat  Published on  20 Nov 2020 10:46 AM GMT
76 మంది పిల్లల్ని రక్షించిన ఆ మహిళా కానిస్టేబుల్‌కు డైరెక్ట్ ప్రమోషన్

న్యూఢిల్లీ: ప్రమోషన్ కొట్టడం అంత సులువు కాదు. అది ప్రభుత్వ కంపెనీల్లో అయినా ప్రైవేటు సంస్థలోనైనా కావొచ్చు. ఉద్యోగులు మంచి ప్రతిభ చూపితే ప్రమోషన్ రావడం సులువే. ఎంప్లాయి తన బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తే మంచి పేరుతోపాటు ప్రమోషన్‌‌లు కూడా దక్కుతాయి. దీనికి ఢిల్లీకి చెందిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌‌ సీమా ధాకాను ఉదాహరణగా చెప్పొచ్చు.

76 మంది పిల్లలను వారి కుటుంబాలకు సురక్షితంగా అందించిన ఢిల్లీ పోలీస్ మహిళా హెడ్ కానిస్టేబుల్‌‌ సీమా ధాకాకు ప్రమోషన్ లభించింది. తప్పిపోయిన పిల్లలను వారి ఇళ్లకు చేర్చడంలో కృషి చేసినందుకు గాను సీమాకు ఇంటెన్సివ్ స్కీమ్‌‌లో ప్రమోషన్ ఇచ్చారు. ఇలా ప్రమోషన్ అందుకున్న తొలి పోలీస్ ఆఫీసర్ సీమానే కావడం గమనార్హం. దీంతో పాటు అసాధారణ్‌ కార్యా పురస్కర్ అవార్డుకు సీమాను ఎంపిక చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

ఢిల్లీతోపాటు పంజాబ్, బెంగాల్ లాంటి పలు రాష్ట్రాలకు చెందిన తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకోవడంలో సీమా చాలా శ్రమించింది. ఆమె పట్టుకున్న 76 మంది పిల్లల్లో 56 మంది చిన్నారుల వయస్సు 14 ఏళ్ల లోపు ఉండటం గమనార్హం. ఇంత మంది పిల్లల జాడను రెండున్నర నెలల వ్యవధిలో కనుగొనడం విశేషంగా చెప్పొచ్చు.

'ఎవరైనా కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 50 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల ఆచూకీ కనుగొంటే వారిని డైరెక్ట్ ప్రమోషన్‌‌ కిందకు పరిగణిస్తాం. ఇలా పట్టుకోవడానికి వారికి 12 నెలల కాల వ్యవధి మాత్రమే ఉంటుంది' అని ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటలో తెలిపారు.


Next Story