ముంబైలో 144 సెక్షన్.. ఏవేవి క్లోజ్ చేస్తారంటే..!
Section 144 imposed in Mumbai as Omicron cases rise. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు.
By Medi Samrat Published on 30 Dec 2021 10:33 AM ISTదేశ వాణిజ్య రాజధాని ముంబైలో 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. పండుగ సీజన్, నూతన సంవత్సర వేడుకల సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఈ నెల ప్రారంభంలో ముంబైలో సెక్షన్ 144 విధించింది. ఇప్పుడు, నగరంలో COVID-19 మరియు Omicron కేసులు వేగంగా పెరుగుతుండడంతో 144 సెక్షన్ ను జనవరి 7, 2022 వరకు పొడిగించబడింది. డిసెంబర్ 30 నుండి జనవరి 7, 2022 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు & క్లబ్‌లతో సహా, బహిరంగ ప్రదేశంలో కొత్త సంవత్సర వేడుకలు, పార్టీలను నగర పోలీసులు నిషేధించారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. భారతదేశంలో కోవిడ్-19, ఓమిక్రాన్ కేసులు ఢిల్లీ, మహారాష్ట్రలలో ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ముంబైలో 85 ఓమిక్రాన్ కేసులతో సహా 3,900 కరోనా కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 923 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది మే 2021 నుండి అత్యధికం. ఓమిక్రాన్‌పై ఎనిమిది కేసులు నమోదైన తర్వాత నగరంలో మొదట సెక్షన్ 144 విధించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ కూడా లెవెల్ -1 (ఎల్లో అలర్ట్) ఆంక్షలు విధించింది. నగరంలో పాజిటివిటీ రేటు 1 శాతానికి మించితే త్వరలో లెవల్ -2 పరిమితులను విధించవచ్చు.
భారతదేశంలో గత 24 గంటల్లో 13,154 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 3,900 కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు 961కి చేరాయి.