గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2002 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ సీఎం ప్రధాని మోదీతో పాటు మరికొందరికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు(శుక్రవారం) దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీలో హత్యకు గురైన 69 మందిలో పిటిషనర్ జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. ఈ అల్లర్ల జరిగిన సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీతో పాటు 64 మందికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ జాకియా జాఫ్రీ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు సైతం సిట్ చర్యను సమర్థించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. కిందటి ఏడాది డిసెంబర్‌లోనే తీర్పును రిజ్వరులో పెట్టింది. కాగా.. నేడు తీర్పును వెలువరించింది.