కరూర్‌ తొక్కిసలాట.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై నేడు 'సుప్రీం' తీర్పు

తమిళనాడులో నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా జ‌రిగిన‌ కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయి 100 మందికి పైగా గాయపడిన విషాద సంఘటనపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

By -  Medi Samrat
Published on : 13 Oct 2025 9:52 AM IST

కరూర్‌ తొక్కిసలాట.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం తీర్పు

తమిళనాడులో నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా జ‌రిగిన‌ కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయి 100 మందికి పైగా గాయపడిన విషాద సంఘటనపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రచురించిన కాజ్‌లిస్ట్ ప్రకారం.. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 13న తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన విచారణను కోరగా.. BJP నాయకుడు ఉమా ఆనందన్‌తో సహా పలువురు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణను కోరుతున్నారు.

ఇటీవల తమిళనాడులో అత్యంత దారుణమైన క్రౌడ్ కంట్రోల్ వైఫల్యాలలో ఒకటైన ఈ విషాదం దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. రాజకీయ కార్యక్రమాలలో ప్రజల భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

ఇంతకుముందు.. మద్రాస్ హైకోర్టు ఈ విషాద సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఐపిఎస్ అధికారి అస్రా గార్గ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.. అయితే సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణకు నిరాకరించింది.

సెప్టెంబరు 3న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ ఘోరమైన సంఘటన తర్వాత టీవీకే రాజకీయ నాయకత్వం తమ అనుచరులను బాధ్య‌త లేకుండా విడిచిపెట్టిందని విమర్శించింది. "దిగ్భ్రాంతికరంగా, రాజకీయ పార్టీ నాయకుడితో సహా కార్యక్రమ నిర్వాహకులు, వారి స్వంత కార్యకర్తలు, అనుచరులు, అభిమానులను విడిచిపెట్టి వేదిక నుండి పరారీ అయ్యారు. పశ్చాత్తాపం లేదా బాధ్యత లేదా విచారం కూడా లేదు" అని జస్టిస్ ఎన్. సెంథిల్‌కుమార్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది. మద్రాస్ హైకోర్టు.. విషయం జరిగిన వెంటనే సంఘటన స్థలం నుండి వెళ్లిపోయిన‌ విజయ్, ఈవెంట్ నిర్వాహకులు, రాజకీయ పార్టీ సభ్యుల ప్రవర్తనను తీవ్రంగా ఖండించింది. తొక్కిసలాట వంటి పరిస్థితితుల‌లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి.. సహాయం చేయడానికి పార్టీ బాధ్యత తీసుకోవాల‌ని వ్యాఖ్యానించింది.

TVK కార్యదర్శి ఆధవ్ అర్జున మద్రాస్ హైకోర్టు తన నాయకత్వంపై చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి TVK నాయకులు, క్యాడర్ ప్రజలు మూర్ఛపోయినట్లు నివేదికలు రాగానే "వెంటనే సమన్వయం, సహాయం అందించారు" అని అన్నారు.

నిష్పక్షపాతంగా, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరిపి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను సమర్పించాలని మద్రాస్ హైకోర్టు సిట్‌ను ఆదేశించింది.

Next Story