ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారీ ఊర‌ట‌

ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, క్యాసినోలకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.

By Medi Samrat  Published on  10 Jan 2025 4:27 PM IST
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారీ ఊర‌ట‌

ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, క్యాసినోలకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేత కేసులో ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థకు జారీ చేసిన రూ. 21,000 కోట్ల జీఎస్‌టీ నోటిఫికేషన్ నోటీసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై కూడా అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.

కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1న GST చట్టాన్ని సవరించింది. దీని కింద విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారత్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. అక్టోబర్ 2023లోనే GST విభాగం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని ఆరోపించింది.

ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పందెంగా వేసే మొత్తం డబ్బుపై 28 శాతం GST విధించబడుతుందని ఆగస్టు 2023లో GST కౌన్సిల్ స్పష్టం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గేమింగ్ కంపెనీలు వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ తర్వాత తొమ్మిది హైకోర్టుల నుంచి 28 శాతం జీఎస్టీని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది.

అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌ వెంకటరామన్‌ కోర్టులో జీఎస్‌టీ విభాగం తరఫు వాదనలు వినిపించారు. కొన్ని షోకాజ్ నోటీసుల గడువు ఫిబ్రవరిలో ముగుస్తుందని చెప్పారు. ఈ విషయాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. గేమింగ్ కంపెనీలపై అన్ని చర్యలను నిలిపివేయాలని కూడా పేర్కొంది.

గేమ్స్ 24x7, హెడ్ డిజిటల్ వర్క్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ వంటి అనేక ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. 2023లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్.. గేమింగ్ కంపెనీలకు 71 నోటీసులు పంపింది. ఇందులో 2022-23, 2023-24 మొదటి ఏడు నెలల కాలంలో వడ్డీ, పెనాల్టీ మినహా రూ. 1.12 లక్షల కోట్ల విలువైన జిఎస్‌టిని ఎగవేసినట్లు కంపెనీల‌పై ఆరోపణలు వచ్చాయి.

Next Story