మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం కొనసాగుతంది. 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసుపై షిండే క్యాంపు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసును, శాసనసభా పక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్, రిజిస్ట్రార్.. షిండే క్యాంపు అభ్యర్ధనలను విచారించే అవకాశం ఉంది.
తనపై ఉన్న అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ షిండే వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. షిండే, కొంతమంది ఎమ్మెల్యేలు జూన్ 21నుంచి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం వారు అస్సాంలోని గౌహతిలో ఉన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి శివసేన వైదొలగాలన్నది వారి ప్రధాన డిమాండ్.