జూన్ 2న జైలుకు వెళ్లను.. కేజ్రీవాల్‌ ప్రకటనపై సుప్రీంలో ఈడీకి ఎదురుదెబ్బ‌

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనపై సుప్రీంకోర్టుకు వెళ్లిన‌ ఈడీకి ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on  16 May 2024 1:55 PM IST
జూన్ 2న జైలుకు వెళ్లను.. కేజ్రీవాల్‌ ప్రకటనపై సుప్రీంలో ఈడీకి ఎదురుదెబ్బ‌

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనపై సుప్రీంకోర్టుకు వెళ్లిన‌ ఈడీకి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ ప్రకటనపై ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది, దానిపై కోర్టు విచారణకు నిరాకరించింది. ప్రజలు ఆప్‌కి ఓటేస్తే జూన్ 2న తాను మళ్లీ జైలుకు వెళ్లనని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడానికి ఎస్సీ (సుప్రీంకోర్టు) నిరాకరించింది.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ తన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో జూన్ 2న మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. తమ పార్టీ నేతలు కష్టపడి జూన్ 4న ఇండియా కూట‌మి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీఎం అన్నారు.

ఆప్‌ని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ త‌న‌ను జైలుకు పంపిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాలు విఫలమయ్యాయని.. మా పార్టీ మరింత సంఘటితమైందని అన్నారు.

ఈడీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాద‌న‌లు వినిపించారు. ప్రజలు ఆప్‌కి ఓటు వేస్తే జూన్ 2న మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఎన్నికల ర్యాలీల్లో కేజ్రీవాల్ చేసిన ప్రసంగాన్న కోర్టు దృష్టికి తీసుకెళ్ల‌గా.. ఇది అతని అవగాహన, మేము ఏమీ చెప్పలేమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

Next Story