కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపుపై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సంజయ్ మిశ్రాకు మూడోసారి పొడిగింపును మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వానికి రిలీఫ్ ఇస్తూ ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని 5 ఏళ్లకు పొడిగిస్తూ వచ్చిన రూల్ సరైనదేనని కోర్టు పేర్కొంది.
సంజయ్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించరాదని 2021లో ఆదేశించామని.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం గుర్తుచేసింది. దీంతో ఆయన జూలై 31 వరకు మాత్రమే పదవిలో కొనసాగనున్నారు. సంజయ్ కుమార్ మిశ్రా 2018లో రెండేళ్ల పదవీకాలనికి గానూ ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2020 నవంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. 13 నవంబర్ 2020న జారీ చేసిన ఉత్తర్వులో కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు పెంచింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2021లో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి గరిష్టంగా ఐదేళ్లకు పెంచాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను ఆమోదించారు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.