రాజకీయ పునరాగమనంపై దృష్టి సారించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ సోమవారం సాయంత్రం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. శశికళ కార్యాలయం విడుదల చేసిన ప్రకారం ఆమె నటుడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశానికి రజనీకాంత్ భార్య లత కూడా హాజరయ్యారని ఆ ప్రకటనలో తెలిపారు. పోయెస్ గార్డెన్‌లోని రజినీ నివాసానికి వెళ్లిన శశికళ 40 నిముషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. కాసేపటికి రజనీకాంత్‌ను ఎందుకు కలిశారో ప్రకటన విడుదల చేశారు.
"రజినీ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. పరామర్శ కోసం మాత్రమే ఇంటికి వెళ్లాను. ఎలాంటి రాజకీయ కోణం లేదు" అని ప్రకటనలో పేర్కొన్నారు. డెబ్బై ఏళ్ల రజినీకాంత్ అక్టోబరు 28న అస్వస్థతతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. తరువాత ఆయనకు కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేశారు. అక్టోబర్ 31న రజినీకాంత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్ 29న, తాను రాజకీయ పార్టీని ప్రారంభించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, రజినీకాంత్ వెనక్కి తగ్గారు. తన అనారోగ్యం, కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు. పలువురు తమిళనాడు నాయకులు రజినీని తమ వైపు తిప్పుకోవాలని.. ఆయన సపోర్ట్ తమకే అని చెప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. చిన్నమ్మ కూడా అందుకే వెళ్లిందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.