మాస్ వార్నింగ్ లు ఇస్తున్న శివసేన నేత సంజయ్ రౌత్
Sanjay Raut warns Sena rebels in Guwahati. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆదివారం సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు
By Medi Samrat Published on 26 Jun 2022 1:26 PM GMTశివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆదివారం సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. శివసేనకు వ్యతిరేకంగా ఉన్న ఆ నాయకుల ఆత్మలు చనిపోయాయని.. వారి మృతదేహాలు మాత్రమే ముంబైకి తిరిగి వస్తాయని అన్నారు.
"అక్కడ ఉన్న 40 మంది [తిరుగుబాటు ఎమ్మెల్యేలు] సజీవంగా లేరు. వారి మృతదేహాలు మాత్రమే ఇక్కడకు వస్తాయి, వారి మనస్సాక్షి ఎప్పుడో చనిపోయింది. గౌహతి నుండి బయటికి వచ్చినప్పుడు, వారు మనసుతో ఉండరు. ఈ విషయం వారికి కూడా తెలుసు " అని రౌత్ అన్నారు. "తిరుగుబాటు ఎమ్మెల్యేల ఆత్మలేని మృతదేహాలు అస్సాం నుండి వస్తాయి. పోస్ట్‌మార్టం కోసం నేరుగా మహారాష్ట్ర అసెంబ్లీకి పంపబడతాయి," అన్నారాయన.
తిరుగుబాటు నేతలకు సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా హెచ్చరిస్తున్నారు. 'ఇంకా ఎంతకాలం గౌహతిలో దాక్కుంటారు? చౌపట్టికి తిరిగిరావాలి' అంటూ ఆదివారం ట్వీట్ చేశారు. శివసేన అనర్హత పిటిషన్‌పై 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ చిత్రాన్ని సైతం సంజయ్ రౌత్ షేర్ చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ శనివారం నోటీసులు జారీ చేసి, లిఖితపూర్వక సమాధానాలను దాఖలు చేసేందుకు సోమవారం వరకు గడువు ఇచ్చారు. షిండే వర్గం 'శివసేన బాలాసాహెబ్' పేరిట కొత్త పార్టీని ప్రకటించింది. ఈ క్రమంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమై శివసేన, బాలాసాహెబ్ పేరును వాడకుండా తీర్మానం చేసింది.