చనిపోడానికి సిద్ధం కానీ.. శివసేనను వీడను : సంజయ్ రౌత్
Sanjay Raut Recats On ED Raids. మహారాష్ట్ర ఎంపీ, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నివాసంలో
By Medi Samrat Published on 31 July 2022 12:53 PM GMTమహారాష్ట్ర ఎంపీ, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈడీ ఏప్రిల్‌లో రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. పత్రాచల్ భూ కుంభకోణంలో (మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇది వరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, ఆగస్టు 7 తర్వాత మాత్రమే హాజరవుతానని రౌత్ తన లాయర్ల ద్వారా ఈడీకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ ఉదయం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వచ్చారు. ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయి.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఈ దాడి జరిగిందని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఇదే సందర్భంలో తాను ఎలాంటి స్థితిలోనూ శివసేనను వీడేది లేదని స్పష్టం చేశారు. "నాకు ఎలాంటి కుంభకుణంతో సంబంధం లేదని దివంగత బాలాసాహెబ్ థాక్రేపై ప్రమాణం చేస్తున్నాను. నేను చనిపోతాను కానీ శివసేనను వీడను. నేనెవరికీ తలొగ్గను. బాలా సాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పించారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. " అని రౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.