సనాతన ధర్మం వివాదం: బీజేపీ.. తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్న ఉదయనిధి
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై విమర్శలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
By అంజి Published on 4 Sept 2023 9:15 AM ISTసనాతన ధర్మం వివాదం: బీజేపీ.. తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్న ఉదయనిధి
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై విమర్శలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఆదివారం మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తాను నిరంతరం చెబుతానని అన్నారు. అయితే సనాతన ధర్మాన్ని విశ్వసించే వారిని నరమేధం చేయాలని తాను పిలుపునిచ్చానని కొందరు చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాను సనాతన ధర్మాన్ని విశ్వసించే వారిని నిర్మూలించడం గురించి మాట్లాడలేదన్నారు. సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని అన్నానని తెలిపారు. సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సిద్ధాంతమని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు.
''నేను నా ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. సనాతన ధర్మం కారణంగా అణగారిపోయిన ప్రజల ప్రతినిధిగా నేను ఈ విషయాలు చెప్పాను. సనాతన ధర్మంపై పెరియార్, అంబేద్కర్ చేసిన లోతైన కృషిని, సనాతనం ధర్మంవల్ల కలిగే దుష్ఫలితాలను మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా ప్రసంగంలోని కీలకమైన భాగాన్ని రిపీట్ చేస్తున్నాను. కోవిడ్-19, డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందినట్లే, అనేక సామాజిక దురాచారాలు వ్యాప్తి చెందడానికి సనాతనం కారణమని నేను నమ్ముతున్నాను. నా వాదనలపై ఇటు న్యాయస్థానంలోనైనా, అటు ప్రజా న్యాయస్థానంలోనైనా పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను'' అని ఉదయనిధి వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని నిర్మూలించాలని తానెప్పుడూ పిలుపునివ్వలేదని ఆయన అన్నారు.
బీజేపీ వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేస్తోందని, ఇది వారి సాధారణ అలవాటు అని ఆరోపించారు. మరోవైపు ఉదయనిధి ప్రసంగాన్ని కోర్టులో సవాల్ చేస్తామని లీగల్ యాక్టివిజంతో సంబంధం ఉన్న లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ వెల్లడించింది. దీనిపై స్పందించిన ఉదయనిధి.. తాను చట్టపరమైన ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియాలో తెలిపారు. బీజేపీ నేతలు, పలువురు సోషల్ మీడియాలో ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేస్తుంటే, కొందరు మాత్రం ఆయనకు సపోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు.