కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు సంయుక్త్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు సెప్టెంబర్ 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ నేత ఆశీష్ మిట్టల్ మాట్లాడుతూ.. గతేడాది కూడా కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 25న భారత్ బంద్ నిర్వహించామని గుర్తు చేశారు.
ఇక ఈ ఏడాది పిలుపునిచ్చిన భారత్ బంద్ మరింత విజయవంతం అవుతుందని భావిస్తున్నట్టు ఆశీష్ మిట్టల్ తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో భాగంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిందన్నారు. ఇదిలావుంటే.. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పది సార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరపగా విఫలమయ్యాయి.