భారతదేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం మరో ఆలోచనతో ముందుకు రాబోతోంది. భారతదేశంలో సింగిల్ సిగరెట్ విక్రయాలపై త్వరలో నిషేధం విధించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి స్మోకింగ్ జోన్లను తొలగించాలని కూడా భావిస్తోంది. ఒక్కో సిగరెట్.. ఒక్కో సిగరెట్ కాలుస్తూ ఉంటే.. జోబులకు చిల్లు పడడాన్ని ధూమపాన ప్రియులు పెద్దగా పట్టించుకోరు.. అదే ఒకటేసారి సిగరెట్ ప్యాకెట్ కొనాలంటే కాస్త ఆలోచిస్తారని కేంద్రం భావిస్తోంది.
స్టాండింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, సింగిల్ సిగరెట్ల విక్రయం, తయారీని పార్లమెంటు త్వరలో నిషేధించే అవకాశం ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ-సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. జిఎస్‌టి అమలులోకి వచ్చినప్పటికీ పొగాకు ఉత్పత్తులపై పన్ను గణనీయంగా పెరగలేదని స్టాండింగ్ కమిటీ తెలిపింది. తాజా పన్ను శ్లాబ్‌ల ప్రకారం దేశంలో బీడీలపై 22శాతం, సిగరెట్లపై 53శాతం, పొగలేని పొగాకుపై 64శాతం జీఎస్టీ విధిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.