కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు పడుతుండటంతో కేరళలోని అన్ని నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. భారీ వరదల కారణంగా పంబ నది ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో పంబ, శబరిమలకు భక్తులను అధికారులు అనుమతించడం లేదు. ఇవాళ పంబ, శబరిమలలో దర్శనాలు నిలిపివేశారు. పంబా డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు యాత్రికుల భద్రత కోసం పంబా, శబరిమల యాత్రను నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులందరూ సహకరించాలని కేరళ సర్కార్ కోరింది. భక్తులను వారి భద్రత దృష్ట్యా మాత్రమే శబరిమలకు అనుమతించట్లేదని కేరళ సర్కార్ తెలిపింది. కేరళ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి నిలకడగా ఉంది. కక్కి-అనాతోడ్ రిజర్వాయర్‌కు కూడా రెడ్ అలర్ట్ స్టేటస్ జారీ చేసినట్లు పతనంతిట్ట అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకున్న యాత్రికులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో "దర్శనం" కోసం అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కోవిడ్-19 పరిస్థితిని ఎదుర్కొంటూ, వందలాది మంది భక్తులు అయ్యప్ప ఆలయంలో ప్రార్ధనలు చేయడానికి కొండలపైకి వెళుతున్నారు. నవంబర్ 16 న శబరిమల ఆలయం తెరవబడింది. రెండు నెలల పాటు వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ కోసం ఆలయాన్ని తెరిచారు. మహమ్మారి, భారీ వర్షాల దృష్ట్యా యాత్రికుల రాకను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులను వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా అనుమతిస్తున్నారు.