రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వీటి ధరలు పెరిగే అవకాశం..!
Russia-Ukraine war effect cooking oil prices may go up.ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం రెండో రోజుకు చేరుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2022 7:57 AM GMTఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం రెండో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఒకటి లేదా రెండు రోజుల్లోనే మొత్తం కీవ్ పట్టణాన్ని రష్యా తమ ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 137 మంది పౌరులు, సైనిక సిబ్బంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయన్-రష్యాల మధ్య ఉద్రిక్తతలు కనుక తగ్గకపోతే దీని ప్రభావం భారత్‌పై చాలా గట్టిగానే పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వస్తువుల ధర పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
పొద్దుతిరుగుడు పువ్వు నూనెను మనదేశంలో అత్యధికంగా వినియోగిస్తుంటారు. ఈ నూనె కోసం మనం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంటాం. దిగుమతుల్లో మెజార్టీ భాగం ఉక్రెయిన్(70శాతం), రష్యా(20 శాతం) నుంచి దిగుమతి చేస్తుకుంటున్నాం. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి వస్తోంది. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోయింది. అయితే.. ఇప్పటికిప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమీ లేకపోయినా.. మరో 2 నుంచి మూడు వారాలు ఇలాంటి పరిస్థితే కొనసాగితే ఇబ్బందులు తప్పని విశ్లేషకులు అంటున్నారు.
మనదేశంలో గోధుమలను కూడా ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా గోధుమలను ఎగుమతి దేశాల్లో రష్యా టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల నుంచి సరఫరా స్తంభిస్తే.. గోధుమల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది.
ఇక సెల్‌ఫోన్ల తయారీపైనా పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే సెల్‌ఫోన్లకు తయారీలో వినియోగించే పల్లాడియం అనే లోహాన్ని రష్యా అత్యధికంగా ఎగుమతి చేస్తుంటుంది. ప్రస్తుతం రష్యాపై పలుదేశాలు ఆంక్షలు విధిస్తుండడంతో వీటి(పల్లాడియం) ధరలు పెరిగే అవకాశం ఉంది. మనదేశం నుంచి టీ అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. మనం చేసే ఎగుమతుల్లో 18 శాతం ఆదేశానికే వెలుతుంటాయి. తాజాగా ఉక్రెయిన్, రష్యాల మధ్య కొనసాగుతున్న పరిస్థితులు టీ ఉత్పత్తిదార్లు, ఎగుమతిదారులను కలవరపెడుతున్నాయి.