ప్రశాంత్ కిషోర్ అసలు ఏమన్నారు..?
RSS real coffee, BJP just the frothy top. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం ఓ విధంగా
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం ఓ విధంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని అంటూ ఉంటారు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. గాడ్సే వాదానికి గాంధీలను బలపరచడమే కరెక్ట్ అని .. తన ప్రొఫెషనల్ జీవితంలో పదేళ్ల పాటు నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డిలకు పని చేయకుండా కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పని చేసి ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన స్థితిలో ఉండేందుకు తాను ఆ పదేళ్లు కేటాయించి ఉన్నట్లయితే బాగుండేదని అన్నారు.
బీహార్లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే, ఆదివారం పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని అర్థం చేసుకోలేనిదే ఆ పార్టీని ఓడించలేరని విశ్లేషించారు. ఓ కప్పులో పైపైన ఉండే నురుగు బిజెపి అయితే దాని కింద ఉండే అసలైన కాఫీయే 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' ( ఆర్ఎస్ఎస్) అని వ్యాఖ్యానించారు. సామాజిక వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ భాగమైపోయిందనీ, షార్ట్ కట్స్ తో దాన్ని ఓడించలేరని చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రశాంత్ కిషోర్ సహకరించారు. బీజేపీ సొంతంగా మెజారిటీలోకి రావడానికి ఆయన వ్యూహాలు సహాయపడ్డాయి. గాంధీ కాంగ్రెస్ పునరుద్ధరించడం ద్వారానే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని గ్రహించడానికి తనకు చాలా సమయం పట్టిందని.. నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డికి పనిచేయడానికి బదులు నేను ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుండేదని పీకే అన్నారు.