సంఘంలో 75 ఏళ్లు దాటితే తప్పక పదవి నుంచి తప్పుకోవాలనే నియమం లేదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సారథి మోహన్ భగవత్ స్పష్టం చేశారు. RSS శతాబ్ది వేడుకల సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “సంఘంలో మేమంతా వాలంటీర్లమే. ఏ పని అప్పగించినా వయసు కారణంగా తిరస్కరించే అవకాశం ఉండదు. నాకు 80 ఏళ్లు వచ్చినా, సంఘం ‘శాఖ’ నడపమంటే తప్పనిసరిగా చేయాలి. వయసుతో సంబంధం లేకుండా, సంఘం చెప్పిన పని చేయడం మా కర్తవ్యం” అన్నారు. తాను ఎప్పుడూ “నేను రిటైర్ అవుతాను లేదా వేరెవరు రిటైర్ అవ్వాలి” అని చెప్పలేదని స్పష్టంచేశారు.
అయితే మోహన్ భగవత్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇద్దరూ ఈ సెప్టెంబర్‌లో 75 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. ఇంతకుముందు జూలైలో నాగపూర్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భగవత్ 75 ఏళ్లు పూర్తయిన తర్వాత నాయకులు పదవుల నుండి తప్పుకోవాలి” అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన ఆ మాటలు ఆర్వీఎస్ సిద్ధాంతకర్త మోరొపంత్ పింగ్లే అభిప్రాయాలను ఉటంకిస్తూ చెప్పారు. ఇప్పుడు, ఆ వ్యాఖ్యపై వస్తున్న చర్చలకు ఆయన స్పష్టతనిచ్చి, “సంఘంలో వయసుకు సంబంధం లేకుండా, ఎవరికైతే పని అప్పగిస్తారో వారు చేయాలి” అని పునరుద్ఘాటించారు.