రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా..?

Robert Vadra hints at entering politics. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్

By Medi Samrat  Published on  21 July 2022 8:00 PM IST
రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా..?

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు గురువారం విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. సోనియా గాంధీని ఐదుగురు అధికారుల‌తో కూడిన ఈడీ బృందం 3 గంట‌ల పాటు విచారించింది. అనంత‌రం తొలిరోజు విచార‌ణ ముగిసిన‌ట్లు ప్రక‌టించి అధికారులు సోనియాను ఇంటికి పంపించారు. ఇదే కేసులో ఈ నెల 25న మ‌రోమారు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఈడీ అధికారులు సోనియా గాంధీకి స‌మ‌న్లు జారీ చేశారు.

సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడంపై ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. ఈ ఏజెన్సీలు ప్రశ్నించేందుకు పిలిచిన బీజేపీ నాయకుడి పేరు చెప్పండి.. తమ విధానాలపై దేశం అసంతృప్తిగా ఉందని బీజేపీ భావించిన ప్రతిసారీ వాటిని ఉపయోగించి.. గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.

"ఈ దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. దేశంలో అవసరమైన మార్పును నేను తీసుకురాగలనని ప్రజలు భావిస్తే, నేను రాజకీయాల్లోకి వస్తాను" అని ఆయన అన్నారు. జీఎస్టీ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నందునే సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తోందని రాబర్ట్ వాద్రా అన్నారు. "ఈ రోజుల్లో, వ్యాపారవేత్తలు ఆదాయపు పన్ను శాఖ నుండి కాకుండా ED నుండి నోటీసు పొందుతున్నారు" అని చెప్పుకొచ్చారు. గాంధీ కుటుంబానికి అండగా ఉంటానని, అయితే ఈడీ కార్యాలయానికి వెళ్లి సమస్యలను సృష్టించడం ఇష్టం లేదని అన్నారు.




Next Story