దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్‌ చేయండి. లేదంటే నేనే లొంగిపోతాను: తేజస్వీ యాదవ్‌

RJD leader dares Nitish Kumar to arrest him. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్లకు

By Medi Samrat  Published on  6 Dec 2020 1:03 PM GMT
దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్‌ చేయండి. లేదంటే నేనే లొంగిపోతాను: తేజస్వీ యాదవ్‌

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్లకు మద్దతుగా పలు రాష్ట్రాల్లోని పార్టీలు సంఘీభావం తెలుపుతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) రైతులకు మద్దతుగా పోరాటం చేస్తూ ఉంది. శనివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదన్నారు పోలీసులు. తేజస్వీ యాదవ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన 18 మంది ముఖ్య నాయకులు, మరో 500 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

దీంతో తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిరికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం రైతులకు మద్దతుగా తాము నిలిచినందుకు మాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మీకు నిజంగా దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్‌ చేయండి. లేదంటే నేనే లొంగిపోతాను అని అన్నారు. రైతుల కోసం నేను ఉరికి కూడా సిద్ధంగా ఉన్నాను.. 10 రోజుల నుంచి కఠినమైన చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలిపితే మాపై తప్పడు కేసులు నమోదు చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు.

నూతన వ్యవసాయ బిల్లుల రద్దును డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు విఫలమయ్యాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు డిసెంబర్ 8వ తేదీన రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.


Next Story