నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది.

By -  Knakam Karthik
Published on : 16 Dec 2025 12:51 PM IST

National News, Delhi, National Herald case,  Sonia, Rahul Gandhi, ED,

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట

ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఫిర్యాదు చట్టపరంగా నిలదొక్కుకోలేదని (Not Maintainable) స్పష్టం చేస్తూ ఢిల్లీ కోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో ఈడీ దర్యాప్తు చట్టబద్ధతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి.

కోర్టు పరిశీలనలో, ప్రాథమిక నేరానికి (Predicate Offence) సంబంధించిన సరైన చట్టపరమైన ఆధారం లేకుండానే ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిందన్న వాదనకు బలం చేకూరినట్టు న్యాయ వర్గాలు తెలిపాయి. కేవలం ప్రైవేట్ ఫిర్యాదుల ఆధారంగా ఈసీఐఆర్ (ECIR) నమోదు చేయడం చట్ట విరుద్ధమని కోర్టు అభిప్రాయపడినట్టు సమాచారం.

కేసు నేపథ్యం

నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు మొదలైంది. సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ తొలుత దర్యాప్తు ప్రారంభించింది. అయితే, 2015–16లో ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేయలేమంటూ ఈడీనే వెనక్కి తగ్గింది. తరువాత, 2019లో తన వైఖరిని మార్చుకున్న ఈడీ, పీఎంఎల్‌ఏ కింద మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సుమన్ దూబే, సామ్ పిట్రోడా తదితరులపై ఆరోపణలు నమోదు చేసింది.

ఎఫ్‌ఐఆర్ లేకుండా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధమని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈడీ సొంతంగా జారీ చేసిన టెక్నికల్ సర్క్యులర్ నం.01/2015 ప్రకారం కూడా, ఈసీఐఆర్‌కు ముందు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పీఎంఎల్‌ఏలో తరువాత చేసిన సవరణలను గతానికి వర్తింపజేయలేమని (Retrospective application) వాదించారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఈడీ ఫిర్యాదును విచారణకు స్వీకరించలేమని తేల్చింది. ఈ తీర్పు రాజకీయంగా మాత్రమే కాకుండా, న్యాయపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తు సంస్థలు తమ అధికారాలను ఎలా వినియోగించాలి, ప్రైవేట్ ఫిర్యాదుల ఆధారంగా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయవచ్చా అన్న అంశాలపై ఈ తీర్పు స్పష్టతనిచ్చిందని నిపుణులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఈ తీర్పును స్వాగతిస్తూ, “ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు” అని వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈడీ తదుపరి న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నేషనల్ హెరాల్డ్ కేసు ఇకపై పైకోర్టుల్లో కొనసాగుతుందా, లేక ఇక్కడితో ముగుస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Next Story