ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో రిలయన్స్ సంస్థ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఉంది. ఆక్సిజన్ అందించడానికి సంస్థ చాలా వరకూ ప్రయత్నిస్తూ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ను తయారు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడమే కాకుండా.. సరఫరా కూడా మొదలు పెట్టింది.

రిలయన్స్ సంస్థ మెడికల్ ఆక్సిజన్ తయారీదారు కాకపోయినప్పటికీ కరోనా కారణంగా ప్రాణాలు పోతుండడాన్ని చూసి.. ప్రజలను కాపాడాలన్న లక్ష్యంతో ఆక్సిజన్ తయారు చేయడాన్ని సంస్థ మొదలుపెట్టింది. అతి కొద్ది రోజుల్లోనే సంస్థ 0 నుంచి 1000 MT మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను తయారు చేసే స్థాయికి ఎదిగింది. భారత దేశంలో వినియోగిస్తున్న ఆక్సిజన్ లో అత్యధికంగా 11 శాతం రిలయన్స్ సంస్థ నుంచి తయారు చేసిందే..! పది మందిలో ఒకరు రిలయన్స్ సంస్థ అందించిన ఆక్సిజన్ ను అందుకుంటూ ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని రిలయన్స్ సంస్థ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ స్వయంగా చూసుకుంటూ ఉన్నారట..! ఆక్సిజన్ ను తయారు చేసి.. దేశ వ్యాప్తంగా అవసరం ఉన్న ప్రదేశాలకు సరఫరా చేస్తోంది. రిలయన్స్ లో ఉత్పత్తి చేయబడిన ఆక్సిజన్ ను వివిధ రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన గతేడాది మేలో రిలయన్స్ దేశ వ్యాప్తంగా 55,000 MT మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను దేశ వ్యాప్తంగా సరఫరా చేసింది.

ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపడడం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదన్నారు. దేశంలో సాధ్యమైనంత మేర ఆక్సీజన్ తయారీని పెంచడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు రవాణా చేయాల్సిన అవసరం ఉందని.. జామ్ నగర్ లోని తమ ఇంజనీర్లు అవిశ్రాంతంగా పని చేస్తూ ఈ కరోనా కష్టకాలంలో దేశానికి ఆక్సిజన్ సరఫరా చేయడం తమకు గర్వంగా ఉందన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో తమకు సాధ్యమైనంత సాయం చేస్తున్నామన్నారు. ప్రతీ ప్రాణం విలువైనదేనన్నారు.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుమిత దావ్రా ప్రశంసించారు. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌కు చెందిన చమురు శుద్ధి కర్మాగారాలలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతోందని.. అంత భారీ స్థాయిలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి.. సేవ చేస్తుండడం గొప్ప విషయమని అన్నారు. మరో 700 టన్నులకు పైగా మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోందని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్‌కు సుప్రీం కోర్టులో సుమిత దావ్రా తెలియజేశారు.


సామ్రాట్

Next Story