గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య పౌరులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. ముడి పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వంట నూనెలపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా కేంద్రం తగ్గించింది. దీంతో వంట నూనె ధరలు కాస్తా తగ్గనున్నాయి. లాక్‌డౌన్ సమయం నుండి వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే.
కాగా దసరా పండుగ వేళ.. నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు చాలా వరకు ఊరట కలిగించింది. దిగుమతి సుంకాలను తగ్గించడంతో పాటు, అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది. దీంతో ముడిపామాయిల్‌పై 7.5 శాతం, ముడి సోయాబిన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడ ఆయిల్‌పై 5.5 శాతం అగ్రిసెస్ తగ్గింది. అలాగే రిఫైన్డ్ వంట నూనెలపై 32.5 శాతం నుంచి 17.5 శాతానికి బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో తగ్గిన ధరలు అక్టోబర్ 14 నుంచి 2022 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి.