జనవరి 1 నుండి కొత్త చెక్ రూల్స్

RBI New Cheque Rules. జనవరి 1 నుండి కొత్త చెక్ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

By Medi Samrat  Published on  14 Dec 2020 10:45 AM GMT
జనవరి 1 నుండి కొత్త చెక్ రూల్స్

జనవరి 1 నుండి కొత్త చెక్ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను జారీ చేసింది. రూ. 50 వేలకు మించిన చెక్కుల విషయంలో పలు కీలక అంశాలను బ్యాంకు అధికారులు మరోసారి ధ్రువీకరించుకోవాల్సి వుంటుంది. రూ. 50 వేల కన్నా అధిక మొత్తానికి చెక్ ను జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ.. లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం వివరాలు, చెక్ నంబర్ ను బ్యాంకుకు తెలియజేయాలని అంటోంది ఆర్.బి.ఐ. చెక్కుల జారీ విషయంలో అవకతవకలను నిరోధించడంలో భాగంగా పాజిటివ్ పే విధానాన్ని అమలు చేయనున్నామని ఆర్బీఐ తెలిపింది. మోసపూరిత లావాదేవీలకు చెక్ చెప్పడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తయారు చేసినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది.

మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్ఎంఎస్ ల ద్వారా ఈ వివరాలను పంపాల్సి వుంటుంది. ఈ అంశాలనన్నింటినీ బ్యాంకు అధికారులు రెండోసారి ధ్రువీకరించుకున్న తరువాతే క్లియరెన్స్ చేస్తారు. ఖాతాదారులు జారీ చేసిన చెక్కులు, జమ చేసిన చెక్కు వివరాలను అధికారులు సీటీఎస్ (చెక్ క్లియరింగ్ సిస్టమ్స్)తో సరిపోల్చుకుంటారు. ఈ సమాచారంలో ఏ మాత్రం తేడా ఉన్నా, ప్రెజెంటింగ్ బ్యాంకులకు సీటీఎస్ నుంచి వెంటనే సమాచారం వెళ్లనుంది.

ఈ కొత్త విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇదే సాఫ్ట్ వేర్ ఇండియాలోని అన్ని బ్యాంకులకూ ఇప్పటికే చేరిపోయింది. జనవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. కాబట్టి ఇకపై చెక్ ఇచ్చిన వారు, చెక్ తీసుకోబోయే వారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Next Story
Share it