'PM కేర్స్ ఫండ్' ట్రస్టీలలో ఒకరిగా రతన్ టాటా
Ratan Tata among newly appointed trustees of PM CARES Fund. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 'PM కేర్స్ ఫండ్' ట్రస్టీలలో ఒకరిగా ఎంపికయ్యారు.
By Medi Samrat
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 'PM కేర్స్ ఫండ్' ట్రస్టీలలో ఒకరిగా ఎంపికయ్యారు. PM కేర్స్ ఫండ్ ట్రస్ట్‌కు నామినేట్ చేయబడిన ట్రస్టీలలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ K T థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగిన మరుసటి రోజు వారి నియామకాలను ప్రకటించడం విశేషం. ట్రస్టీస్‌తో పాటు పీఎం కేర్స్ ఫండ్ అడ్వైజరీ బోర్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్‌రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా కో-ఫౌండర్, ఇండీకార్ప్స్, పిరామల్ ఫౌండేషన్ సీఈఓ ఆనంద్ షాలను అడ్వైజరీ బోర్డులో నియమించింది ప్రభుత్వం.
కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యంతో పీఎం కేర్స్ ఫండ్ పనితీరు విస్తృతమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా జీవితంలో వారి అపారమైన అనుభవంతో వివిధ ప్రజా అవసరాలకు ఫండ్‌ను అందించడంలో వారి అనుభవం ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది. పీఎం కేర్స్ ఫండ్‌లో అంతర్భాగంగా మారినందుకు ట్రస్టీలను ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో స్వాగతించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పీఎం కేరీస్ ఫండ్ ఇతర ట్రస్టీలుగా ఉన్నారు.
PM కేర్స్ ఫండ్ సహాయంతో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ప్రదర్శన కూడా జరిగింది. ఈ సమావేశంలో రతన్ టాటా పాల్గొన్నారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరు మరింత మెరుగుపరుస్తుంది ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రారంభించారు. ఈ ఫండ్ ద్వారానే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గతేడాది మే 29న ప్రారంభమైంది.