రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు మూడు వారాలపాటు పెరోల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. సిర్సాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ ను రాబోయే మూడు వారాల పాటు విడుదల చేయనున్నట్లు జైలు అధికారి ధృవీకరించారు. 2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల పెరోల్ జారీ చేశారు.
సోమవారం నాడు గుర్మీత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. మెడికల్ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్ మాత్రమే జారీ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు పెరోల్ జారీ అయింది. గుర్మీత్ రామ్ రహీమ్ కు ఫిబ్రవరి 7 నుండి 20 వరకు పెరోల్ మంజూరు చేయబడిందని.. అతని కుటుంబ సభ్యులు తప్ప, డేరా చీఫ్ ను కలవడానికి ఎవరినీ కలవడానికి అనుమతించరు.. అతన్ని గురుగ్రామ్ పోలీసులకు అప్పగిస్తామని జైలు అధికారి తెలిపారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో డేరా బాబా బయటకు రావడం కూడా హాట్ టాపిక్ అయింది.