ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి ఫోటో వైరల్
అయోధ్య రామ మందిరం.. ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్యరూపం భక్తులకు దర్శనమిస్తోంది.
By Medi Samrat Published on 19 Jan 2024 1:15 PM GMTఅయోధ్య రామ మందిరం.. ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్యరూపం భక్తులకు దర్శనమిస్తోంది. బాలరాముడి చేతిలో బంగారు వర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాలరాముడి విగ్రహం తయారీ తర్వాత కార్యశాలలో దించిన ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కూడా అదే బాలరాముడి దివ్యరూపం అని తెలిపింది. రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించారు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అయోధ్యలో జరుగుతున్న రామ మందిరం నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు. రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతోందని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారని సీఎం యోగి తెలిపారు. భక్తులు పూర్తిగా సహకరించి రాముడి దర్శనం చేసుకోవాలని ఆయన సూచించారు. టెంట్ సిటీ, ధర్మశాల, హోటల్ వంటి నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. లక్నో, ప్రయాగ్‌రాజ్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులకు మెరుగైన గ్రీన్ కారిడార్ సిద్ధమైందని సీఎం తెలిపారు.