త‌వాంగ్‌లో ఘ‌ర్ష‌ణ‌.. నేడు పార్లమెంట్ ఉభయసభల్లో రక్షణమంత్రి ప్రకటన

Rajnath Singh to make statement in Parliament on India-China troops clash in Tawang. తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 6:17 AM GMT
త‌వాంగ్‌లో ఘ‌ర్ష‌ణ‌.. నేడు పార్లమెంట్ ఉభయసభల్లో రక్షణమంత్రి ప్రకటన

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణపై రక్షణ శాఖ‌ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి ఈ అంశంపై ప్రకటన చేయ‌నున్న‌ట్లు చెప్పింది.

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి భారత్. చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఇరువైపుల సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు సోమ‌వారం భార‌త సైన్యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఘ‌ర్ష‌ణ అనంత‌రం ఇరు దేశాల బ‌ల‌గాలు ఆ ప్రాంతం నుంచి వెన‌క్కి వెళ్లాయ‌ని సైన్యం స్ప‌ష్టం చేసింది. అనంత‌రం అక్క‌డి భార‌త క‌మాండ‌ర్‌, చైనా త‌ర‌పు క‌మాండ‌ర్‌తో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపార‌ని పేర్కొంది. స‌రిహ‌ద్దుల్లో తిరిగి శాంతియుత ప‌రిస్థితుల‌ను నెల‌కొల్పే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని వివ‌రించింది.

2020 జూన్‌లో భార‌త్‌, చైనా బ‌ల‌గాలు తూర్పు ల‌ద్ధాఖ్‌లోని గ‌ల్వాన్‌లో తీవ్ర‌స్థాయిలో ఘ‌ర్ష‌ణ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆనాటి ఘ‌ట‌న‌లో కల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది భారత సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. అదే ఏడాది ఆగ‌స్టులో తూర్పు ల‌ద్ధాఖ్‌లోనే రించెన్‌లా ప్రాంతంలో వ‌ద్ద ఇరు దేశాల బ‌ల‌గాలు మ‌రోసారి ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్నాయి. ఆ త‌రువాత మ‌ళ్లీ ఘ‌ర్ష‌ణ ప‌డ‌డం ఇదే తొలిసారి.

ఈ నేప‌థ్యంలో చైనాతో సరిహద్దు పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా నోటీసులు ఇచ్చారు. దిగువ సభలో మనీష్ తివారీ నోటీసు ఇవ్వగా, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సయ్యద్ నాసిర్ హుస్సేన్ ఎగువ సభలో వాయిదా నోటీసులు ఇచ్చారు.

Next Story