పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ప్రాంతీయ భద్రతా పరిణామాల విషయమై భారతదేశ రక్షణ సన్నద్ధతను సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అధ్యక్షతన అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఛైర్మన్ సమీర్ కామత్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ నాలుగో వారంలోకి ప్రవేశించగా.. హోర్ముజ్ జలసంధి వాణిజ్య మార్గానికి అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో ఇరాన్ 86 ఏళ్ల సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు గురైన తర్వాత ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
ప్రతీకారంగా.. ఇరాన్ పలు గల్ఫ్ దేశాల్లోని ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. దీనివల్ల జలమార్గంలో మరింత అంతరాయం కలగడంతో పాటు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కూడా దెబ్బతిన్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో కొనసాగుతున్న సంఘర్షణలోని వివిధ అంశాలు, భారతదేశ ఇంధన భద్రతపై ప్రకటనలు చేసే అవకాశం ఉంది. నిన్న ప్రధానమంత్రి మోదీ లోక్‌సభలో ప్రసంగిస్తూ, పశ్చిమ ఆసియాలోని పరిణామాలు, భారతదేశంపై వాటి ప్రభావం గురించి సభ్యులకు వివరించారు. ఆయన అక్కడి పరిస్థితిని "ఆందోళనకరమైనది"గా అభివర్ణించారు.