త‌ప్పు చేస్తే మళ్లీ 'ఆపరేషన్ సింధూర్‌'.. పాక్‌కు రక్షణ మంత్రి హెచ్చ‌రిక‌లు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించారు.

By Medi Samrat
Published on : 29 July 2025 4:48 PM IST

త‌ప్పు చేస్తే మళ్లీ ఆపరేషన్ సింధూర్‌.. పాక్‌కు రక్షణ మంత్రి హెచ్చ‌రిక‌లు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించారు. చ‌ర్చ‌కు 16 గంటల స‌మ‌యం నిర్ణయించారు. ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని ఆయన ప్రశంసించారు. మన సైనికులు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారని, ఎలాంటి పౌర ప్రాణాలను కోల్పోకుండా చేశారని రక్షణ మంత్రి అన్నారు. ఇది భారతదేశ శక్తికి, ధైర్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

మేము ప్రతి కుట్రను భగ్నం చేసాము కాబట్టి పాకిస్తాన్ భారతదేశంలోని ఏ లక్ష్యం మీద దాడి చేయలేకపోయింది. ఆపరేషన్ సింధూర్‌లో, పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు మరియు సానుభూతిపరులు హతమయ్యారని పేర్కొన్నారు.

ఆపరేషన్ సింధూర్‌ను ప్రస్తుతానికి నిలిపివేశామని, అయితే పాకిస్థాన్ మళ్లీ ఏదైనా తప్పు చేస్తే.. మళ్లీ ప్రారంభించేందుకు భారత్ వెనుకాడేది లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన మాటలతో అన్నారు.

ఆపరేషన్ సింధూర్ గేమ్‌ను మార్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారతదేశం ఇప్పుడు నిశ్శబ్దంగా బాధపడే దేశం కాదు. మనది శక్తిమంతమైన దేశం అని చూపించాం అని పేర్కొన్నారు. పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులు ఉన్నప్పటికీ.. మనం చాలా మంది ప్రాణాలు కోల్పోయామని.. అయితే ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఆయన అన్నారు.

పీఓకే ప్రజలు భారత పాలనా వ్యవస్థలో భాగమయ్యే రోజు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విపక్షాలకు సవాల్ విసిరిన రాజ్‌నాథ్ సింగ్.. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. 'అవును' అని సమాధానం చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మనం ఒక్క సైనికుడిని కూడా కోల్పోలేదు.

పాకిస్థాన్ తన దేశంలో ఉగ్రవాదాన్ని నియంత్రించలేక‌పోతే.. భారత్ సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రపంచం మొత్తానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ త‌న దేశం నుంచి తరిమికొట్టాలని భారత్ కోరుకుంటోందని ఆయన నొక్కి చెప్పారు.

పాకిస్థాన్‌కే కాకుండా చైనాకు, ఇతర శత్రువులకు కూడా రాజ్‌నాథ్ సింగ్ గట్టి సందేశం ఇచ్చారు. 'ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్‌కే కాకుండా దాని మద్దతుదారులకు కూడా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది' అని ఆయన అన్నారు.

Next Story