అటు సినిమాటిక్ గా.. ఇటు సైకిల్ ఉండేలా రజనీకాంత్ పార్టీ గుర్తు
Rajinikanth Party Symbol. రజనీకాంత్.. రాజకీయాల్లోకి అతి త్వరలో రాబోతున్నారు.
By Medi Samrat Published on 11 Dec 2020 8:10 AM GMTరజనీకాంత్.. రాజకీయాల్లోకి అతి త్వరలో రాబోతున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఆయన, ఆయన మిత్ర బృందం, పార్టీకి సంబంధించిన ముఖ్య సభ్యులు పార్టీ జెండా, పార్టీ గుర్తులపై కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. రజనీకాంత్ పార్టీలో కూడా సైకిల్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సైకిల్ అనగానే తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. రజనీకాంత్ పార్టీ బృందం కూడా ఆ విషయంలో కాస్త ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
తనకు అత్యంత సన్నిహితులైన అర్జున్ మూర్తి, తమిళ రవి మణియన్ లు సహా, మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శలతో భేటీ అయి, సమావేశం జరిపారు. ఏది ఏమైనా ప్రజలను ఆకట్టుకునేలా గుర్తు, జెండా ఉండాలని రజనీ తెలిపారు. పార్టీ చిహ్నంగా సైకిల్ ను ఎంచుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారు నిర్ణయించాలని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అదే గుర్తు ఉండటంతో అభ్యంతరాలు, వివాదాలు వచ్చే అవకాశం ఉందని భావించి.. కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ నటించిన 'అన్నామలై' చిత్రంలో అభిమానులను ఎంతో అలరించిన సైకిల్, పాలక్యాన్, రజనీ గెటప్ ను చిహ్నంగా ఎంచుకోవాలని వీరంతా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై రజనీ తుది నిర్ణయం తీసుకుంటారు. రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ తిరువణ్ణామలైకు వచ్చి, అరుణ గిరినాథర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రజనీ తిరువణ్ణామలై నుండి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటూ ఉన్నారు. రజనీకాంత్ పార్టీ పెట్టగానే ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆయన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జయలలిత మరణించిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ఇలాంటి సమయంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరమైన అంశం.