తమిళనాట రజినీ ఆటో..!
Rajinikanth Party Name and Symbol. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయి.
By Medi Samrat Published on 15 Dec 2020 6:01 AM GMT
జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయి. కొద్దికాలం క్రితం కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించి వచ్చే ఏడాది జరగనున్న ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు సిద్దం కాగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సమరంలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తలైవా.. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందని.. జనవరిలో పార్టీ లాంచ్ జరుగుతుందని తెలియజేశారు. రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తున్నారని ప్రకటించిన వెంటనే అభిమానులలో ఆనందం అవధులు దాటింది.
కొత్త పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియనణ్‌ను నియమించుకున్నారు. కాగా.. పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలపై కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. గతవారంలో ముఖ్యనేతలతోనూ సమావేశం నిర్వహించారు. తాజాగా పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. రజినీకాంత్ పార్టీకి 'మక్కల్ సేవై కర్చీ'(ప్రజాసేవ పార్టీ) అనే పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
`నేనాటోవాడ్ని.. ఆటోవాడ్ని.. అన్నగారి రూటు వాడ్ని.. న్యాయమైన రేటువాడ్ని.` అంటూ `బాషా`లో రజనీకాంత్ ఆటో డ్రైవర్ గా తన విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు అదే ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ 'మక్కల్ సేవై కర్చీ' పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతకుముందు రజినీ 'బాబా లోగో'ను కోరగా.. దాన్ని కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలను ఈ నెలాఖరున రజనీకాంత్ స్వయంగా వెల్లడించనున్నారు.