రజనీకాంత్ రాజకీయ మద్దతుపై క్లారిటీ వచ్చేసింది
Rajini tells RMM members he will not support any party in TN polls. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని రజనీ మక్కల్ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు సుధాకర్ తెలిపారు.
By Medi Samrat
తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని రజనీ మక్కల్ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు సుధాకర్ తెలిపారు. అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మక్కల్ మండ్రం నిర్వాహకులు, అభిమానులు వారికి నచ్చిన పార్టీల్లో చేరవచ్చని మక్కల్ మండ్రం తరపున ఆయన ప్రకటించారు. అయితే మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మక్కల్ మండ్రం నిర్వాహకులు డీఎంకే, బీజేపీ సహా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ మక్కల్ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు జిల్లా కార్యదర్శులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ రానున్న ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు.
అర్జున మూర్తితో ఎలాంటి సంబంధం లేదు
రజనీకాంత్ ఇక రాజకీయాల్లో రారు అనే ప్రకటన వచ్చిన వెంటనే అర్జున మూర్తి పేరు తెరపైకి వచ్చింది. రాజకీయాలకు సంబంధించి రజనీకాంత్‌కు కుడిభుజంగా ఉన్న అర్జున మూర్తి, కొత్త పార్టీ పెడతారని, ఆ పార్టీకి తెరవెనుక రజనీకాంత్ అండదండులు ఉన్నాయని అంతా భావించారు. ఈ పుకార్లు వచ్చిన వెంటనే రజనీకాంత్‌పై విమర్శల వర్షం మొదలైంది. ఎందుకంటే తమిళనాడు బీజేపీ మేథో విభాగం అధ్యక్షుడిగా ఎన్నో ఏళ్లు పని చేశారు అర్జున మూర్తి. ఆయన రాజకీయ అనుభవం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్నారంటూ ఆయనపై ప్రచారం జరుగుతోంది. దీనిని వెంటనే రజనీ తీవ్రంగా ఖండించారు. అర్జునమూర్తి కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి రజనీకాంత్ కు చెందిన పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించారు. ఈ మేరకు రజనీ స్థాపించిన మక్కల్ మండ్రం పార్టీకి చెందిన కార్యదర్శులు విస్తృతంగా ప్రకటన చేశారు.
రజనీకాంత్ భార్య పార్టీ పెడుతున్నారా..?
కాగా, రజనీకాంత్ భార్య లతా కొత్తగా మరో పార్టీ పెట్టబోతున్నారని, భర్త ఆశీస్సులతో రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు మీడియాలో దాదాపు మూడు వారాలుగా నలుగుతున్న పెద్ద వార్త ఇది. దీనిపై కూడా రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. తన భార్య పార్టీ పెట్టబోతున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.