ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్‌లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం అర్థరాత్రి వైమానిక దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ తో అత్యంత పొడవైన సరిహద్దును పంచుకునే రాజస్థాన్ అంతటా భద్రతా చర్యలను కఠినతరం చేశారు. రాజస్థాన్ సరిహద్దు పట్టణాలైన ఖజువాలా, అనుప్‌గఢ్ నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ రహస్య స్థావరాన్ని భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. దీనితో దేశవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.
రాజస్థాన్ రాష్ట్రం మొత్తం హై అలర్ట్‌లో ఉంచబడినప్పటికీ, పాకిస్థాన్ సరిహద్దు జిల్లాలైన బికనీర్, జైసల్మేర్, బార్మెర్, శ్రీగంగానగర్‌లలో పాఠశాలలు మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా బికనీర్, జోధ్‌పూర్ విమానాశ్రయాలను కూడా మూసివేశారు. జైపూర్ విమానాశ్రయంలో నాలుగు విమానాలను రద్దు చేశారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పై నుండి ఫైటర్ జెట్‌ల శబ్దాలు విన్నట్లు జైసల్మేర్, బార్మెర్ నివాసితులు నివేదించారు.