బీహార్‌లో ఓ రైల్వే ఇంజనీర్ ను అధికారులు మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాళ్లోకెళితే.. పాతకాలపు రైలు ఆవిరి ఇంజిన్(మీటర్ గేజ్ ఇంజన్)ను అక్రమంగా 'స్క్రాప్'గా విక్రయించడానికి ప్రయత్నించాడు ఆ రైల్వే ఇంజనీర్. పూర్నియా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇంజనీర్ రాజీవ్ రంజన్ ఝాతో పాటు మరో ఆరుగురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ మేరకు.. సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లోని డివిజనల్ సెక్యూరిటీ కమీషనర్ ఏకె లాల్.. నిందితులను అరెస్టు చేయడానికి, సామగ్రిని రికవరీ చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ANIకి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పు మధ్య రైల్వే పరిధి సమస్తిపూర్ డివిజన్ డీఆర్‌ఎం అలోక్ అగర్వాల్ తెలిపారు. "ఇది అసాధారణమైన సందర్భం, రైల్వే నమ్మకంపై పనిచేస్తుంది, కానీ ఎవరో దానిని విచ్ఛిన్నం చేసారు," అని అలోక్ అగర్వాల్ అన్నారు.
ప్రజల ప్రదర్శన కోసం పూర్నియాలో ఉంచబడిన మీటర్ గేజ్ ఇంజన్‌ను డిసెంబరు 14న సుశీల్ యాదవ్ అనే వ్యక్తి గ్యాస్ కట్టర్‌తో కూల్చివేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఆర్‌పీఎఫ్ అధికారులు సుశీల్ యాదవ్ ను విచారించగా.. డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఇంజిన్ నుండి స్క్రాప్ మెటీరియల్‌ను సమీపంలోని డీజిల్ లోకోమోటివ్ షెడ్‌కు తీసుకెళ్లమని ఆదేశించినట్లు ఒక ఒక లేఖను చూపించాడు. పిక్ అప్ వ్యాన్‌లో ఉన్న స్క్రాప్ మెటీరియల్‌తో స్పాట్ నుండి బయలుదేరే ముందు అధికారులు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఒక మెమో కూడా రాశారు. స్క్రాప్ డీజిల్ షెడ్‌కు చేరలేదని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఒక రోజు తర్వాత రాకెట్ బయటపడింది. విచారణలో స్క్రాప్ రవాణా కోసం ఎటువంటి ఆర్డర్ జారీ చేయలేదని.. ఆ లేఖ నకిలీదని తేలింది. పోలీసులు మెటీరియల్ కోసం వెతుకుతున్నారు.