కర్నాటకలో కేవలం రూ.15 వేల జీతంతో పనిచేసిన మాజీ క్లర్క్ ఆస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సంపద ఎంత ఉందంటే.. లోకాయుక్త అధికారులు ఆయన నివాసానికి చేరుకుని సోదాలు చేయడంతో వారు కూడా తలలు పట్టుకున్నారు.
వ్యక్తి పేరు కలకప్ప నిడగుండి.. కొప్పల్‌లోని కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌లో క్లర్క్‌గా పనిచేశాడు. జీతం 15 వేలు మాత్రమే.. కానీ నెలకు లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి కలలో కూడా ఊహించలేనంత సంపద పోగేశాడు.
KRIDL మాజీ క్లర్క్ నివాసంపై లోకాయుక్త అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ సోదాల్లో అతని ఆధీనంలో 24 ఇళ్లు, 4 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి దొరికింది. దీంతో పాటు అతని వద్ద నుంచి 4 వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆస్తులన్నీ ఆయన, ఆయన భార్య, సోదరుడి పేరిట ఉన్నాయి. కలకప్ప నిడగుండి, KRIDL మాజీ ఇంజనీర్ ZM చించోల్కర్‌తో కలిసి 96 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కల్పిత పత్రాలు, నకిలీ బిల్లులను సృష్టించడం ద్వారా 72 కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులందరిపై కర్ణాటకలోని లోకాయుక్త దాడులు నిర్వహిస్తోంది. మంగళవారం, హాసన్, చిక్కబలాపుర, చిత్రదుర్గ, బెంగళూరులో ఐదుగురు ప్రభుత్వ అధికారులతో సంబంధం ఉన్న స్థలాలపై దాడులు నిర్వహించారు.