క్రికెట్ లో విద్వేషంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi's veiled comment on Wasim Jaffer row. టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇటీవలే ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు

By Medi Samrat  Published on  13 Feb 2021 11:52 AM GMT
క్రికెట్ లో విద్వేషంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇటీవలే ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జట్టు ఎంపికలో తన ప్రమేయం లేకుండానే మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని, ఏకంగా కెప్టెన్ సహా 11 మందిని మార్చేశారని వసీం జాఫర్ ఆరోపించాడు. ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం మాత్రం... జాఫర్ జట్టును మతం పేరుతో రెండుగా చీల్చాడని చెబుతోంది. దాంతో వసీం జాఫర్ ప్రతిస్పందిస్తూ... మతమే సమస్య అయితే వాళ్లే తనను తొలగించేవాళ్లని, తానెందుకు రాజీనామా చేస్తానని ధీటుగా సమాధానం ఇచ్చాడు.


ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గత కొన్నేళ్లుగా విద్వేషం అనేది ఓ సాధారణ అంశంలా మారిపోయిందని, చివరికి మనం ఎంతగానో అభిమానించే క్రికెట్ క్రీడను కూడా కమ్మేసిందని విచారం వ్యక్తం చేశారు. భారతదేశం మనందరికి చెందింది, మన ఐక్యతను విచ్ఛిన్నం చేసే అవకాశం విద్వేషవాదులకు ఇవ్వొద్దు అని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంలోనూ రాహుల్ తన గళం వినిపించారు. బీజేపీ తరహాలో ప్రతిభకు పట్టం కట్టారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

వసీం జాఫర్‌ ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితులయ్యాడు. కానీ ఏడాదిలోపే తన పదవికి రాజీనామా చేశాడు. జాఫర్‌ రాజీనామాను ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయు) అంగీకరించింది. వసీం జాఫర్ దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీకి కొద్దిరోజుల ముందే కోచ్ పదవికి రాజీనామా చేయడం సంచలనం అయింది. వసీం జాఫరే జట్టు సెలెక్షన్ విషయంలో పక్షపాతంగా వ్యవహరించాడని, ఓ వర్గానికి చెందిన ఆటగాళ్లకే ప్రాధాన్యమిచ్చాడని అసోసియేషన్ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు.


ఉత్తరాఖండ్ జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జాఫర్ 'రామ్ భక్త్ హనుమాన్‌కీ జై' అన్న నినాదాన్ని 'గో ఉత్తరాఖండ్'గా మార్చాడని, కనీసం 'ఉత్తరాఖండ్ జై' కి కూడా అంగీకరించలేదని.. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేయమని సూచించాడని, బయో బుబుల్‌లోకి గురువులు తీసుకొచ్చి ప్రార్థనలు చేశారని ఆరోపించారు. మతపరమైన అంశాలను క్రికెట్‌లోకి తీసుకురావడం బాధగా ఉందని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇక్బాల్‌ అబ్దుల్లాను కెప్టెన్‌ చేయమని నేను అడగలేదని.. జై బిస్టాను సారథిగా నియమించాలని అనుకున్నానని తెలిపాడు.


Next Story