లోక్‌సభలో రసాభాస.. మోదీ, రాహుల్‌ మధ్య వాగ్వాదం

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

By అంజి  Published on  1 July 2024 3:54 PM IST
Rahul Gandhi, PM Modi,  Hindus, Amit Shah , Loksabha

లోక్‌సభలో రసాభాస.. మోదీ, రాహుల్‌ మధ్య వాగ్వాదం

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ''గొప్ప నేతలంతా అహింస గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు హిందువులని చెప్పుకునేవాళ్లు హింస, ద్వేషం, అబద్ధాలు మాట్లాడుతున్నారు'' అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గుర్తు అభయముద్ర అని రాహుల్‌ గాంధీ అన్నారు. హిందూ, ముస్లిం, సిక్కు, బుద్ధిజం తదితర మతాల్లో అభయముద్ర ధైర్యాన్ని, భరోసాను సూచిస్తుంది అంటూ ఆయన శివుడు, అల్లా, గురునానక్‌ ఫొటోలను సభలో ప్రదర్శించారు.

దీనిపై అధికార ఏన్డీఏ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇక హిందూత్వ పేరుతో దేశ ప్రజలను బీజేపీ భయపెడుతోందని రాహుల్‌ ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి అమిత్‌ షా.. హింసను ధర్మంతో జోడించడం సరికాదని మండిపడ్డారు. హిందూ భవన తెచ్చిన రాహుల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. “ఈ దేశంలో లక్షలాది మంది తమను తాము హిందువులుగా పిలుచుకుంటారు. వారు హింసకు పాల్పడతారా?” అని షా అన్నారు.

"హింస భావాన్ని ఏదైనా మతంతో ముడిపెట్టడం తప్పు, దీనికి అతను క్షమాపణలు చెప్పాలి" అని అన్నారు. 1970లలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ, ఆ పార్టీ దేశవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేశారని షా ఆరోపించారు. వారికి మాట్లాడే హక్కు లేదని.. ఎమర్జెన్సీ సమయంలో సైద్ధాంతిక ఉగ్రవాదంతో యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. మరోవైపు హిందువులని చెప్పుకుంటున్న వాళ్లు (బీజేపీని ఉద్దేశించి) హింసను ప్రేరేపిస్తున్నారన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్‌‌ అయ్యారు.

హిందూ సమాజన్నంతా హింసావాదులతో పోల్చడం సీరియస్‌ మ్యాటర్‌ అని వ్యాఖ్యానించారు. దీనికి కేవలం మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిస్తే మొత్తం హిందూ సమాజం అవ్వదు అని రాహుల్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో లోక్‌సభ రసాభాసగా మారింది. అంతకుముందు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపాదించిన నీట్-యూజీ పేపర్ లీక్‌పై ఒకరోజు ప్రత్యేక చర్చను స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చిన తర్వాత ప్రతిపక్ష శాసనసభ్యులు సోమవారం లోక్‌సభ నుండి వాకౌట్ చేశారు.

Next Story