'ఎందుకంటే నేను..': పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన రాహుల్ గాంధీ
ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించారు.
By అంజి Published on 11 Oct 2023 9:34 AM IST'ఎందుకంటే నేను..': పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన రాహుల్ గాంధీ
''మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? చర్మ సంరక్షణకు ఏం చేస్తారు? మీకు ఇష్టమైన ఆహారం ఏంటీ?''.. 53 ఏళ్లు నిండిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఓ కాలేజీ విద్యార్థుల నుంచి ఎదురైన ప్రశ్నలు ఇవి. జైపూర్‌లోని మహిళా విద్యార్థినులు ఈ ప్రశ్నలను రాహుల్‌కు సంధించారు. ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించారు. విద్యార్థుల ప్రశ్నలకు రాహుల్ స్పందిస్తూ.. తాను రాజకీయ కట్టుబాట్లతో చాలా బిజీగా ఉన్నానని, అందుకే వివాహం వైపు వెళ్లలేదని చెప్పాడు. జైపూర్‌లోని మహారాణి కాలేజీకి చెందిన విద్యార్థులతో రాహుల్ గాంధీ సంభాషించిన వీడియోను అతని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేశారు.
జైపూర్‌లోని మహిళా విద్యార్థినులు ఆయనను అనేక ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ తేలికైన సమాధానం ఇచ్చారు రాహుల్. "మీరు చాలా తెలివైనవారు, అందంగా ఉన్నారు... పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదు?" ఒక విద్యార్థి కాంగ్రెస్ నాయకుడిని ప్రశ్నించగా, "నేను నా పనిలో, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యాను కాబట్టి" అని బదులిచ్చారు. మీకు ఇష్టమైన వంటకాల గురించి అడిగిన ప్రశ్నకు, రాహుల్ గాంధీ కాకరకాయ, శనగలు, బచ్చలికూర మినహా మిగతావన్నీ బాగా తింటానని చెప్పారు. తన ఇష్టమైన గమ్యం గురించి కూడా రాహుల్ చెప్పారు. "నేను ఎప్పుడూ కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటున్నాను" అని చెప్పాడు.
అలాగే తాను తన ముఖానికి క్రీమ్ లేదా సబ్బును పూయనని, నీటితో మాత్రమే కడుగుతానని చెప్పారు. రాజకీయ నాయకుడు కాకపోతే ఏమి అవుతాడని అడిగినప్పుడు, “నేను నిజానికి చాలా విషయాలు ఆరితేరిన వాడిని. నేనొక ఉపాధ్యాయుడిని. నేను యువకులకు బోధిస్తాను...నేను వంటవాడిని” అని అన్నారు. గతంలో తన ప్రసంగంలోని ఖతమ్, టాటా.. బైబై మీమ్ రూపంలో వైరల్‌గా మారిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఈ ముచ్చట్లను త్వరగా ముగించాలంటూ తన టీమ్ ఒత్తిడి చేస్తోందని 'టాటా బైబై' అని వ్యాఖ్యానించారు.