రాహుల్ గాంధీ.. ఆ యుట్యూబ్ షోలో సందడి చేశారు

Rahul Gandhi relishing Biriyani. రాహుల్ గాంధీ.. ఎలాగైనా ప్రజల మనసులను గెలుచుకోడానికి ఎన్నో పనులు చేస్తూ

By Medi Samrat  Published on  30 Jan 2021 11:27 AM GMT
రాహుల్ గాంధీ.. ఆ యుట్యూబ్ షోలో సందడి చేశారు

రాహుల్ గాంధీ.. ఎలాగైనా ప్రజల మనసులను గెలుచుకోడానికి ఎన్నో పనులు చేస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రజల మీద, సంస్కృతి మీద పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న ఆయన.. ఓ యూట్యూబ్ వీడియోలో కనిపించి సందడి చేయడం విశేషం. అది కూడా వంటల ఛానల్ లో..!

రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేయడానికి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. ఆయన మాత్రం ఓ యూట్యూబ్ వంటల ఛానల్ లో కనిపించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కనిపించి అందరినీ అలరించారు. అతి త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఇటీవలి కాలంలో ఆయన పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. కానీ రాహుల్ మాత్రం వినూత్నంగా 'విలేజ్ కుకింగ్ ఛానల్' బృందంతో కలిసి గడిపారు. కేరళలోని వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్‌ గాంధీ ఇప్పుడు స్ధానిక సెంటిమెంట్‌తో తమిళనాడులో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.


విలేజ్ కుకింగ్ ఛానల్‌కు తమిళనాడు వ్యాప్తంగా మంచి ఆదరణ ఉండడమే కాకుండా దేశ విదేశాల్లోనూ లక్షల మంది ప్రజలు ఈ ఛానల్‌ను వీక్షిస్తుంటారు. తమిళనాడులోని పుడుక్కొట్టై జిల్లా చిన్న వీరమంగళానికి చెందిన పెరియతంబి విలేజ్ కుకింగ్ చానల్ నిర్వహిస్తున్నారు. పెరియతంబి రుచికరమైన వంటకాలు తయారుచేయడంతో పాటూ.. ఆ వంటలను నిరుపేదలకు, అనాథలకు రుచి చూపిస్తారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చానల్‌కు 71 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సహజ సిద్ధంగా ఇందులో వంటలను తయారు చేస్తూ ఉంటారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తారు. ఒక్కో ఐటెమ్ పేరు, ప్రత్యేకత చెబుతూ, వాటి గురించి వివరిస్తూ వంట తయారుచేస్తారు పెరియతంబి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మష్ రూమ్ బిర్యానీతో పాటు అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు నోరూరిస్తాయి.

తమిళనాడు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ విలేజ్ కుకింగ్ బృందాన్ని కలిశారు. మష్ రూమ బిర్యానీ తయారీ విధానాన్ని చూసి, వారితో కలిసి వంట చేశారు. తర్వాత వారితో కలిసి ఆ బిర్యానీ రుచి చూశారు. బిర్యానీ బాగుందంటూ తమిళంలో ప్రశంసించడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో రాహుల్ గాంధీతో పాటుగా కరూర్ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ), కాంగ్రెస్ నాయకుడు జోతిమణి కూడా ఉన్నారు. 14 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్‌ గాంధీ పుట్టగొడుగుల బిర్యానీ తయారు చేస్తున్న ఛెఫ్‌లకు సహకరించడమే కాకుండా వారితో కలిసి రైతా (పెరుగు పులుసు) కూడా తయారు చేశారు.


Next Story