వ్యాక్సినేషన్ పై ప్రభుత్వ తీరును తప్పుబట్టిన రాహుల్
Rahul Gandhi questions Centre over vaccination. దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు
By Medi Samrat Published on 24 July 2021 10:55 AM GMT
దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుర్పించారు. భారత్ లో గడువులోగా వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగింపుపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ స్పందనపై ఓ వార్తా పత్రిక కధనాన్ని జోడిస్తూ రాహుల్ శనివారం ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలు ముప్పు ముంగిట్లో ఉంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేందుకు ఎలాంటి డెడ్‌లైన్లు లేవని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి అంటూ లేదని, అయితే 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ చేపడతామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ తాజాగా ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వానికి సామర్థ్యం లేదనడానికి, వెన్నెముక లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రజల జీవితాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి గడువు ఏమీ లేదని కేంద్ర సర్కారు చెబుతోందని ఆయన గుర్తు చేశారు. మరి వ్యాక్సిన్లు ఎక్కడ? అని రాహుల్ ప్రశ్నించారు.