కేరళలోని వాయనాడ్ లో జరిగిన విధ్వంసం గురించి మనకు తెలిసిందే!! అయితే కేరళలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా కూడా ఈ స్థాయిలో విధ్వంసం జరుగుతుందని ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు. జులై 30 తెల్లవారుజామున రెడ్ అలర్ట్‌ను ప్రకటించామని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఐఎండీ వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉందన్నారు. జులై 30న రెడ్ అలర్ట్ జారీ చేశామని, అదే రోజు కొండచరియలు విరిగిపడ్డాయన్నారు. భారీ వర్షాల కారణంగా వాయనాడ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశముందని కేంద్రం హెచ్చరించినా కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. వాతావరణ శాఖ కేవలం ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని కేరళ సీఎం విజయన్ చెప్పగా.. ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తాము రెడ్ అలర్ట్ జారీ చేశామని.. వివిధ రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేశామని అన్నారు.
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటించారు. తన తండ్రి చనిపోయినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయారు... ఇళ్లనూ పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమవంతు సాయం కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు.