అమెరికా డీల్‌తో భారత రైతులకు ద్రోహం..మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు!
భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
By - Knakam Karthik |
అమెరికా డీల్‌తో భారత రైతులకు ద్రోహం..మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందాల పేరుతో దేశ వెన్నెముక లాంటి రైతును కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పాల ఉత్పత్తి, సోయాబీన్ సాగుపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి ఐదు కీలక ప్రశ్నలను సంధించారు.
రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలివే:
1. పశుగ్రాసం పేరుతో 'విషం' దిగుమతా?
"అమెరికా నుండి DDG (డిస్టిలర్స్ డ్రైడ్ గ్రెయిన్స్) దిగుమతి చేసుకోవడం అంటే.. అమెరికాలో తయారయ్యే జన్యుమార్పిడి (GM) మొక్కజొన్న వ్యర్థాలను మన పశువులకు మేతగా వేయడమేనా? దీనివల్ల భారతీయ పాల ఉత్పత్తి రంగం భవిష్యత్తులో అమెరికా అగ్రికల్చర్ ఇండస్ట్రీపై పూర్తిగా ఆధారపడదా?" అని నిలదీశారు.
2. సోయాబీన్ రైతుల బతుకులు ఆగమేనా?
"జన్యుమార్పిడి (GM) సోయాబీన్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మన రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు ఈ దిగుమతుల రూపంలో వచ్చే మరో 'ప్రైస్ షాక్' తట్టుకునే శక్తి ఉందా?" అని ప్రశ్నించారు.
3. ఆ 'అదనపు ఉత్పత్తుల' రహస్యమేంటి?
"ఒప్పందంలో ప్రస్తావించిన 'అదనపు ఉత్పత్తుల' (Additional Products) జాబితాలో ఏమున్నాయి? ఇది పప్పుధాన్యాలు మరియు ఇతర ప్రధాన పంటలను అమెరికా మార్కెట్‌కు ధారపోసే సంకేతమేనా?" అని రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు.
4. MSP వ్యవస్థను దెబ్బతీసే కుట్ర?
"వాణిజ్యేతర అడ్డంకులు (Non-trade barriers) తొలగించడమంటే.. భవిష్యత్తులో భారత నాణ్యత ప్రమాణాలను సడలించాలని, తద్వారా పప్పుధాన్యాల సేకరణ (Procurement), కనీస మద్దతు ధర (MSP) మరియు బోనస్‌లను తగ్గించాలని అమెరికా నుండి ఒత్తిడి రాదా?" అని కేంద్రాన్ని అడిగారు.
5. ఈ దోపిడీకి అడ్డుకట్ట ఎక్కడ?
"ఒక్కసారి ఈ ద్వారాలు తెరిస్తే, ప్రతి ఏటా కొత్త కొత్త పంటలను అమెరికా మార్కెట్ కోసం పణంగా పెడుతూనే ఉంటారా? మన రైతులను కాపాడే భద్రతా వ్యవస్థ ఏమైనా ఉందా?" అని ఆందోళన వ్యక్తం చేశారు.
"ఇది దేశ ఆహార భద్రతపై దాడి"
"ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు, భారత వ్యవసాయ రంగంపై మరో దేశం సాధించబోయే దీర్ఘకాలిక పెత్తనం. రైతులకు ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలి" అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
US trade deal के नाम पर हम भारत के किसानों के साथ विश्वासघात होते हुए देख रहे हैं।मैं प्रधानमंत्री से कुछ आसान सवाल पूछना चाहता हूं:1. DDG import करने का वास्तव में क्या मतलब है? क्या इसका मतलब यह है कि भारतीय मवेशियों को GM अमेरिकी मक्का से बने distillers grain खिलाए जाएंगे?…
— Rahul Gandhi (@RahulGandhi) February 15, 2026