రాహుల్ వ్యాఖ్యలపై మోదీ గుస్సా..!
Rahul Gandhi Fires On Narendra Modi. కేంద్రంలో మత్స్య శాఖ లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని
By Medi Samrat Published on 25 Feb 2021 4:56 PM ISTకేంద్రంలో మత్స్య శాఖ లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లోనే కేంద్ర ప్రభుత్వం మత్స్య శాఖ ఏర్పాటు చేసిందని మోదీ చెప్పుకొచ్చారు. ఆ విషయం కూడా రాహుల్ కు తెలియకపోవడం షాక్ కు గురిచేసిందన్నారు. గురువారం పుదుచ్చేరిలో మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ''కేంద్రంలో మత్స్య శాఖ లేదని, దాని కోసం ఓ శాఖను ఏర్పాటు చేయాలని రాహుల్ చెప్పడంతో షాక్ అయ్యా. నిజానికి కేంద్రంలో మత్స్య శాఖ అనేది ఒకటుంది. 2019లోనే ఆ శాఖను ఏర్పాటు చేసింది కూడా మేమే'' అని ఆయన అన్నారు.
బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించి 'విభజించు–పాలించు' అన్న సిద్ధాంతాన్ని అనుసరించిందని, కాంగ్రెస్ విధానం కూడా అదేనని అన్నారు. కాంగ్రెస్ ది 'విభజించు–అబద్ధమాడు–పాలించు' సిద్ధాంతమని అన్నారు. అందులోని కొందరు నేతలు సందర్భానికి తగ్గట్టు ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
ఇక మొతేరా స్టేడియం అసలు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంను పునర్నిర్మించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు. ఈ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అసలైన నిజం దానంతట అదే బయటపడటం చాలా బాగుందని ఆయన అన్నారు. 'నరేంద్ర మోదీ స్టేడియం, అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్, కార్యక్రమానికి హాజరైన జై షా' అంటూ ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.