11 మంది రైతుల ప్రాణాలు పోయాయి.. ఫైర్ అయిన రాహుల్

Rahul Gandhi Fire On Govt. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఓ వైపు రైతులు మరో

By Medi Samrat  Published on  14 Dec 2020 7:56 AM GMT
11 మంది రైతుల ప్రాణాలు పోయాయి.. ఫైర్ అయిన రాహుల్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఓ వైపు రైతులు మరో వైపు పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. రైతుల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మొదటి నుండి మద్దతు పలుకుతూ ఉన్నారు. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. దేశంలో ఎంత మంది రైతులు బలి దానాలు చేస్తే నిరంకుశ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతుల నిరసన కొనసాగుతున్న గత 17 రోజుల్లో 11 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా పార్టీ మాజీ చీఫ్ రాహుల్ ట్వీట్‌ని కోట్ చేస్తూ గత 17 రోజులుగా 11 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ మోదీ ప్రభుత్వం విచారాన్ని వ్యక్తం చేయలేదని విమర్శించారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికీ తమకు డబ్బు అందిస్తున్న వారి పక్షానే నిలబడ్డారు తప్పితే అన్నదాతల పక్షాన నిలబడాలని భావించడం లేదని సుర్జీవాలా అన్నారు.

కేంద్రానికి, పంజాబ్-హర్యానా రైతాంగ ప్రతినిధులకు మధ్య ఇంతవరకు 5 దఫాలుగా చర్చలు జరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనన్న డిమాండ్‌ నుంచి రైతులు వెనక్కు తగ్గకపోవడంతో చర్చల ప్రతిష్టంభన కొనసాగుతోంది. ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం 2020, రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్, సౌకర్యాల కల్పన) చట్టం 2020, నిత్యావసర సరుకుల సవరణ చట్టం 2020 అనే మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో గత సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు నేడు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిరశన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘజీపూర్ రహదారిపై కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ దీక్షకు కూర్చోగా, హరియాణా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద రైతులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చున్నారు.


Next Story