కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్‌లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.
By Knakam Karthik
కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్‌లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు. హల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, తాజాగా భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన మరుసటి రోజే విపక్ష నేతలు ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మొదటగా ప్రకటించారు అనే అంశాన్ని రాహుల్ తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"ప్రియమైన ప్రధానమంత్రి గారూ, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం వంటి అంశాలపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల ఏకగ్రీవ అభ్యర్థనను పునరుద్ఘాటిస్తున్నాను. ప్రజలు, వారి ప్రతినిధులు ఈ విషయాలపై చర్చించడం చాలా ముఖ్యం. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంలో మనందరి సామూహిక సంకల్పాన్ని ప్రదర్శించడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. ఈ డిమాండ్‌ను మీరు తీవ్రంగా, వేగంగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను" అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
అటు, తాను గత ఏప్రిల్ 28న కూడా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని మల్లికార్జున ఖర్గే తన లేఖలో గుర్తు చేశారు. "తాజా పరిణామాల దృష్ట్యా, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, మొదట వాషింగ్టన్ డీసీ నుంచి, ఆ తర్వాత భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాల నుంచి వెలువడిన కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న అన్ని ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ అభ్యర్థనను లోక్‌సభ ప్రతిపక్ష నేత ఇప్పటికే మీకు తెలియజేశారు. రాజ్యసభ ప్రతిపక్ష నేతగా నేను ఈ అభ్యర్థనకు మద్దతు ఇస్తున్నాను. మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాను" అని ఖర్గే పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో, అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించడం గమనార్హం. "అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, పాకిస్థాన్‌లు తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఇరు దేశాలు విజ్ఞత ప్రదర్శించినందుకు అభినందనలు" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు.