'ఇప్పుడే మేలుకోండి..' ట్రంప్ టారిఫ్‌లపై ప్రభుత్వానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించారు.

By Medi Samrat
Published on : 28 Aug 2025 10:20 AM IST

ఇప్పుడే మేలుకోండి.. ట్రంప్ టారిఫ్‌లపై ప్రభుత్వానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించారు. దీని వల్ల వస్త్ర, వజ్రాలు, రొయ్యల వ్యాపారం బాగా దెబ్బతింటుంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ భారతదేశంపై అమెరికా విధించిన సుంకం 'అత్యంత ఆందోళనకరమైనది' అని అభివర్ణించారు.

ఏదైనా ఒక వ్యాపార భాగస్వామిపై అతిగా ఆధారపడటం భారత్‌ విపత్తు అని, ఇది పెద్ద హెచ్చరిక అని రఘురామ్ రాజన్ అన్నారు. నేటి ప్రపంచ వ్యవస్థలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ ఎక్కువగా ఆయుధాలుగా మారుతున్నాయని, భారత్‌ జాగ్రత్తగా ముందుకు సాగాలని రాజన్ హెచ్చరించారు.

ఇది ఒక హెచ్చరిక. మనం ఏ ఒక్క దేశంపైనా ఎక్కువగా ఆధారపడకూడదన్నారు. మనం తూర్పు వైపు, యూరప్ వైపు, ఆఫ్రికా వైపు చూడాలి.. USతో ముందుకు సాగాలి. అలాగే, మన యువతకు ఉపాధి కల్పించడానికి అవసరమైన 8-8.5% వృద్ధి రేటును సాధించడంలో మ‌న‌కు సహాయపడే సంస్కరణలను అమలు చేయాలి.

భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధింపు బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. రష్యా నుంచి భార‌త్ చమురు కొనుగోలు చేస్తుంద‌ని అదనంగా విధించిన‌ 25 శాతం పెనాల్టీ కూడా ఇందులో ఉంది. రష్యా క్రూడ్‌ను కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం నుండి భారత్‌ కఠినమైన పన్నులను ఎదుర్కొన్నప్పటికీ, రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనా, యూరప్‌లపై పెద్దగా సుంకాలు విధించలేదు.

రష్యా చమురు దిగుమతులపై భారత్‌ తన విధానాన్ని పునఃపరిశీలించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని అడగాలి. రిఫైనర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. ఎగుమతిదారులు సుంకాలతో ధర క‌డుతున్నారు. లాభాలు చాలా ఎక్కువగా లేకుంటే.. మనం ఈ కొనుగోళ్లను కొనసాగించాలా వద్దా అని ఆలోచించడం విలువైనద‌ని సూచించారు.

Next Story