పబ్జీ.. ఇక ఆపే వారు లేనట్లే..
PUBG Mobile India Pre-registrations Open Now. భారతదేశంలో యువతను ఉర్రూతలూగించిన గేమింగ్ యాప్ 'పబ్జీ'. చైనా కంపెనీ వాసనలు
By Medi Samrat Published on 24 Nov 2020 4:51 PM ISTభారతదేశంలో యువతను ఉర్రూతలూగించిన గేమింగ్ యాప్ 'పబ్జీ'. చైనా కంపెనీ వాసనలు ఉండడంతో భారత ప్రభుత్వం బ్రేక్ వేసిన యాప్స్ లో ఇది కూడా ఒకటి. కానీ భారత్ లో అడుగు పెట్టాలని పబ్జీ అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్ లో ఎటువంటి చిక్కులు కూడా ఉండకుండా.. చైనాతో అన్ని విషయాలలోనూ తెగదెంపులు చేసుకుంది. భారత్ లో అడుగుపెట్టబోతున్నామని ఇటీవలే పబ్జీ ప్రకటించింది.
భారత్ లో మరోసారి లాంచ్ చేసేందుకు అవసరమైన కీలక ప్రక్రియను ఆ సంస్థ పూర్తి చేసింది. కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ వద్ద రిజిస్టర్ చేయించుకుంది. సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా పబ్జీ ఇండియా ఈనెల 21న రిజిస్టర్ చేయించుకుంది. కృష్ణన్ అయ్యర్, హ్యునిల్ సోహ్న్ లను డైరెక్టర్లుగా నియమించింది.
చైనాతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 116 యాప్స్ ను భారత్ నిషేధించగా.. అందులో గేమింగ్ యాప్ పబ్జీ కూడా ఉంది. అక్టోబర్ 30 నుంచి పబ్జీ తన కార్యకలాపాలను పూర్తిగా ఆపేసింది. అతి పెద్ద మార్కెట్ కలిగిన భారత్ లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు పబ్జీ యత్నిస్తోంది. త్వరలోనే పబ్జీ మొబైల్ ఇండియాను లాంచ్ చేయనుంది.
భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తి డేటా భద్రతతో గేమ్ ను తీసుకొస్తున్నట్టు పేర్కొంది. భారత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచే స్టోరేజీ సిస్టమ్స్ పై ఎప్పటికప్పుడు ఆడిట్, వెరిఫికేషన్స్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. భారత్ లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని పబ్జీ కార్పొరేషన్, దాని మాతృ సంస్థ క్రాఫ్టన్ లు భావిస్తూ ఉన్నాయి.