ఫౌజీ గేమ్ ఇంకొన్ని గంటల్లో మీ ముందుకు.. ప్రీ రిజిస్టర్ చేసుకున్నారా..?

PUBG Mobile India Latest update. భారత దేశంలో పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేశాక.. ఫౌజీ గేమ్ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు

By Medi Samrat  Published on  25 Jan 2021 1:59 PM GMT
FAUG game

భారత దేశంలో పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేశాక.. గేమింగ్ ప్రియులు ఆ స్థాయి గేమ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫౌజీ గేమ్ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. స్వదేశీ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ గా ఫౌజీని రూపొందించారు. ఇప్పటికే ఈ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ టీజర్ ఆకట్టుకోగా.. 72వ గణతంత్రదినోత్సవ కానుకగా రేపు విడుదల కాబోతోంది. ఈ స్వదేశీ గేమ్ ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లను సొంతం చేసుకుందని ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ తెలిపారు. ఫౌజీ మొబైల్ గేమ్ జనవరి 26న ప్రారంభించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ గేమ్ మొదట ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లకు అందుబాటులో రానున్నట్లు సమాచారం. పబ్‌జీపై నిషేధం విధించిన కొద్ది నెలల తర్వాత ఫౌజీ గేమ్‌ తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రకటించారు. ఫౌజీని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్‌ అనే గేమింగ్ సంస్థ రూపొందించింది.

భారతీయ గేమర్స్ దీనిని పబ్‌జీ మొబైల్ కి ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారని.. కానీ అది నిజం కాదని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం భారతదేశంలో నిషేధించబడిన పబ్‌జీ మొబైల్‌తో పోల్చినప్పుడు ఫౌజీ చాలా భిన్నమైన గేమ్ అని అంటున్నారు. నాలుగు దశాబ్దాలలో చైనా, భారతదేశం మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా రూపొందించారు. ఇటీవలి కాలంలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఈ గేమ్ తప్పకుండా హిట్ అవుతుందని సంస్థ నిర్వాహకులు అనుకుంటూ ఉన్నారు.


Next Story
Share it