మోదీ 'మన్ కీ బాత్' కు పెద్ద ఎత్తున నిరసన

Protesting Farmers Clang Thalis As PM Addresses "Mann Ki Baat". ఆదివారం రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్

By Medi Samrat  Published on  27 Dec 2020 6:28 PM IST
మోదీ మన్ కీ బాత్ కు పెద్ద ఎత్తున నిరసన

ఆదివారం రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది. ఈ ఏడాది ఆఖరి మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ పలు విషయాలను వెల్లడించారు. కొత్త ఏడాది భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ ఏడాది కరోనా సంక్షోభ పరిస్థితులు మనకు కొత్త పాఠాలను నేర్పాయని.. పరిశోధకులు కూడా అంచనా వేయలేని పరిస్థితులు వచ్చాయని చెప్పారు. భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుందని తెలిపారు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌కు 2021లో స్వస్తి చెప్పాలనే లక్ష్యం ఉందని తెలిపారు. గురుగ్రాం నుంచి కర్ణాటక వరకు స్వచ్ఛమైన వాతావరణంపై శ్రద్ధ పెరిగిందని అన్నారు. దేశ ఉత్పత్తులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారు చేసి, ఎగుమతులను పెంచుకోవాలని చెప్పారు. భారత్‌లో తయారీ దారులు నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిని అందించాలని కోరారు. ఢిల్లీలోని ఝందేవాలా మార్కెట్‌లో గతంలో విదేశీ ఆటవస్తువులే ఎక్కువగా ఉండేవని.. ఇప్పుడు మాత్రం కేవలం దేశీయంగా తయారైన ఆటబొమ్మలే అమ్ముతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రజలు స్థానిక వస్తువులకే ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. సాహిబ్‌జాదే, మాతా గుజ్రీ, గురు తేగ్‌ బహదూర్, గురు గోవింద్ సింగ్‌ వంటి వారి త్యాగాలకు దేశ ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన చెప్పారు.

మోదీ 72 వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయాం.. ఇక చాలు ఆపండి అంటూ రైతులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్‌, ఫరీద్‌కోట్‌, రోహ్‌తక్‌ ప్రాంతాల్లో ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. ఈ మూడు ప్రాంతాలు బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోనివే. ట్విటర్‌లోనూ 'మోదీ బక్వాస్ బంద్ కరో' (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆదివారం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాగానే ఈ హ్యాష్‌ట్యాగ్ భారత్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనలపై మాట్లాడండి అని డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో మోదీ మన్ కీ బాత్‌ వీడియోపై డిస్‌లైక్‌ల వర్షం మొదలైంది. ఆ వీడియోకు వచ్చిన లైక్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో డిస్‌లైకులు వస్తున్నాయి. వ్యవసాయ బిల్లులపై రైతుల నిరసన నేపథ్యంలో గత ఆదివారం స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్ ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలపాలని రైతులకు పిలుపునిచ్చారు. మన మాటలు వినని ప్రధాని మాటల్ని వినాల్సిన అవసరం లేదని.. దానికి నిరసనగా పల్లాలు మోగించండని సూచించారు. ఈరోజు ఆ పల్లాలు మోగించి రైతులు నిరసన వ్యక్తం చేశారు.




Next Story